Teak Clones: ఐదు దశాబ్దాల పరిశోధనకు గుర్తింపు.. మూడు మెరుగైన టేకు క్లోన్‌లకు జాతీయ ఆమోదం! పవన్ కల్యాణ్ అభినందనలు
పవన్ కల్యాణ్ అభినందనలు

Teak Clones: టేకు వృక్షాభివృద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఐదు దశాబ్దాలకుపైగా సాగించిన పరిశోధనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని, దేశంలోనే తొలిసారిగా ఈ అరుదైన ఘనత సాధించినందుకు అటవీశాఖ పరిశోధన విభాగం, ఉద్యోగులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, బెంగళూరులోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐసీఎఫ్ఆర్ఈ-ఐడబ్ల్యూఎస్‌టీ) సంయుక్తంగా పరిశోధన జరిపి అభివృద్ధి చేసిన మూడు టేకు క్లోన్‌లకు జాతీయ స్థాయిలో ఆమోదం లభించిందని వెల్లడించారు. వెరైటీ టెస్టింగ్ అండ్ రిలీజ్ విధానంలో ఈ క్లోన్లను విడుదల చేసేందుకు ఐసీఎఫ్ఆర్ఈ ఆమోదించటం రాష్ట్ర అటవీ పరిశోధన రంగం చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.
నిరంతర పరిశోధన, మొక్కల ఎంపిక, క్షేత్రస్థాయి పరీక్షలు, శాస్త్రీయ మదింపు ఫలితంగా టీజీ-1, టీజీ-2, టీజీ-3 క్లోన్లు రూపుదిద్దుకున్నట్లు వివరించారు. ఇందులో ఏపీఎఫ్‌డీ-ఐడబ్ల్యూఎస్‌టీ-టీజీ-1 క్లోన్‌ను నర్సీపట్నం అటవీ ప్రాంతంలోని గుడిమారిపాకలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ మెరుగైన క్లోన్లు భవిష్యత్తులో కలప ఉత్పాదకతను పెంచటానికి, రైతులు, కలప సాగుదారులకు ప్రయోజనం చేకూర్చటానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
మూడు క్లోన్లు సాధారణ మొక్కలతో పోలిస్తే 10 నుంచి 20 శాతం అధిక చెక్క పరిమాణం, 24 నుంచి 54 శాతం అధిక హార్ట్‌వుడ్ కంటెంట్‌ను రికార్డు చేశాయని అధికారులు వెల్లడించారు. సగటు వార్షిక కలప ఉత్పాదకత హెక్టారుకు 9 నుంచి 11 క్యూబిక్ మీటర్లుగా ఉందని, చెక్క సాంద్రత 0.55 నుంచి 0.64 గ్రాములు క్యూబిక్ సెంటీమీటర్గా ఉందని తెలిపారు. అందమైన రంగు, గ్రెయిన్, బలం లక్షణాలతోపాటు టేకు ఆకు తెగుళ్లకు మధ్యస్థ నుంచి నిరోధకతను ప్రదర్శించాయని చెప్పారు.
1972 నుంచి సాగుతున్న పరిశోధనకు ఈ గుర్తింపు లభించిందని, రాష్ట్ర అటవీశాఖ, ఐసీఎఫ్ఆర్ఈ సంస్థలు కలిసి సాధించిన ఈ ఘనత దేశంలోనే తొలిసారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్థిరమైన అటవీ నిర్వహణకు, రైతుల ఆదాయం పెంపుదలకు ఈ క్లోన్లు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటవీ పరిశోధన రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ఈ మైలురాయి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.
ఈ విజయం రైతులకు, కలప పరిశ్రమకు కొత్త ఆశలు కలిగిస్తుందని, భవిష్యత్తులో టేకు సాగు విస్తరణకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటవీశాఖ పరిశోధన విభాగం, శాస్త్రవేత్తలు, క్షేత్ర సిబ్బంది కృషిని ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ క్లోన్ల విడుదలతో రాష్ట్రం టేకు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలవనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
పర్యావరణ పరిరక్షణతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కలిపి ఇవ్వగల ఈ శాస్త్రీయ విజయం రాష్ట్ర అటవీ విధానానికి బలం చేకూరుస్తుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన క్లోన్ల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సాధించిన ఈ చరిత్రాత్మక ఘనత జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

