గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు

జులై మొదటి వారానికే నిండిపోయిన శ్రీశైలం ప్రాజెక్టు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ మేరకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,98,550 క్యూసెక్కులు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఔట్ ఫ్లో 59,239 క్యూసెక్కులుగా ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315, కరెంట్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 190.33 టీఎంసీలకు చేరింది.

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే వరద ప్రారంభమైంది. జులై మొదటి వారానికి దాదాపు జలాశయం నిండిపోయింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం నాడు గేట్లు ఎత్తనున్నారు. ఈ మేరకు అధికారులు మంత్రి నిమ్మల రామానాయుడికి ఆహ్వానం పంపించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నారు. గేట్లు ఎత్తే సమయంలో అమాత్యులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కృష్ణమ్మకు గంగాహారతి ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు న నాయుడు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద శనివారం సాయంత్రానికి 28.11 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. 48 గేట్ల నుంచి రెండు లక్షల క్యూసెక్కులు స్పిల్‌ ఛానల్‌ ద్వారా గోదావరిలోకి వెళ్తోంది.పట్టిసీమ నుంచి 2800 క్యూసెక్కులు పట్టిసీమ వద్ద గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల పథకంలోని ఎనిమిది పంపుల నుంచి శనివారం 2800 క్యూసెక్కులు ప్రాజెక్టు కుడి కాలువలోకి విడుదల చేశారు.

Updated On 8 July 2025 10:39 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story