మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu Directs Ministers: మరో ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ ఎన్నికలైనా కూటమి అభ్యర్థులే ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో మంత్రులు, నాయకులు పనిచేయాలని ఆయన సూచించారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమ పరిధిలోని స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై సమయానికి సమాచారం అందిస్తామని తెలిపారు.

శుక్రవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాల చర్చ పూర్తయ్యాక ఆయన మంత్రులతో చర్చించారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు సిద్ధం చేస్తామని సీఎం తెలిపారు. దస్త్రాల పరిష్కారం, కీలక పనితీరు సూచీలు (కేపీఐలు), లక్ష్యాల సాధన, కేంద్రం నుంచి నిధుల తెచ్చుకోవడం, ఖర్చు చేయడంలో చూపిన చొరవ వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికలు తయారవుతాయి. గత రెండేళ్లలో రాష్ట్ర పరిస్థితులను సరిదిద్దగలిగామని, ఇక అభివృద్ధి ఊపందుకోవాలని, 2026-27ను కీలక మైలురాయిగా చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మంత్రులు విరివిగా పర్యటనలు చేసి సమీక్షలు నిర్వహించాలని సూచించారు.

మంత్రులు తమ శాఖల్లో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విజయాలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మీ శాఖల్లో ఏం చేశామో చెప్పకపోతే ఎలా? వైకాపా చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కొంత గాడిలో పెట్టగలిగాం. ఇక మీరు వేగం పెంచాలి. సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి’’ అని సీఎం స్పష్టం చేశారు. తెదేపా కార్యాలయం నుంచి పంపే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో మంత్రులు వెనకబడుతున్నారని, దీన్ని సరిచేసుకోవాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.

ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగించి, చివరి భూములకూ నీరందేలా చేయాలి. మే 15కి నారుమళ్ల వేసుకునేందుకు కాలువల్లో నీరు విడుదల చేయాలని సూచించారు. వైకాపా హయాంలో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమై 6-7 లక్షల ఎకరాలకు నీరందకుండా పోయిందని, వాటన్నిటినీ మళ్లీ రన్నింగ్‌లో పెట్టాలని ఆదేశించారు.

రేపల్లె-అవనిగడ్డ ప్రాంతంలో కృష్ణా కరకట్ట బలహీనపడిన చోట్ల గుర్తించి బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 16న అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని, విగ్రహానికి మంచి పేరు ఆలోచించాలని సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story