CM Chandrababu: నీటి సమస్యపై దృష్టి సారించాలి.. రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించాలి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, రిజర్వాయర్లలో నీటి లభ్యతను నిరంతరం అంచనా వేసుకొని తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్‌లో ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
రవాణా శాఖలో వీలైనంత మేర అనవసర నిబంధనలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సీఎం సూచించారు. ఈ శాఖలో పూర్తిస్థాయి సాంకేతికత వినియోగం, అవసరంలేని నిబంధనల తొలగింపు వంటి సంస్కరణల గురించి అధికారులు సీఎంకు వివరాలు అందించారు.
గోదావరి వరద పరిస్థితిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ పాల్గొన్నారు.

