CM Chandrababu: మాతృభాష విస్మరణ మన ఉనికినే కోల్పోవడమే: సీఎం చంద్రబాబు
మన ఉనికినే కోల్పోవడమే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: మాతృభాష మన మూలాలకు, సంస్కృతికి ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్ల భాష అవసరమే అయినప్పటికీ, మాతృభాషను మరచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లవుతుందని హెచ్చరించారు. గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు.
“సంక్రాంతి పండుగకు ముందు వచ్చిన మరో గొప్ప పండుగ ఇది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరును ఈ వేదికకు పెట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. దేశంలో తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉంది. వందలాది భాషలు ఉన్న భారతదేశంలో కేవలం ఆరు భాషలకే ప్రాచీన భాషల హోదా లభించింది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడతాయి. గిడుగు వెంకట రామమూర్తి వంటి మహానుభావులను తెలుగు జాతి ఎప్పటికీ మరవదు. ‘నేను తెలుగువాణ్ణి.. నాది తెలుగు దేశం’ అని గర్వంగా చాటిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్” అని చంద్రబాబు కొనియాడారు.
టెక్నాలజీ పురోగతితో తెలుగు భాషను మరింత సులభంగా కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. “కొత్త యాప్‌లు వచ్చాయి.. తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయి. టైపింగ్ తెలియని వారు కూడా వాయిస్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకునే రోజులు వస్తున్నాయి. పొట్టి శ్రీరాములు పేరిట 1985లోనే ఎన్టీఆర్ తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో మరో తెలుగు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం” అని చంద్రబాబు ప్రకటించారు.
ఈ మహాసభలు తెలుగు భాషా భిమానులను ఒక్క తాటిపై నిలిపి, భాషా సంరక్షణకు కొత్త ఊపిరి పోస్తాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

