RK ROJA : నగరి ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్పై మాజీ మంత్రి రోజా ఫిర్యాదు
తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన రోజా

తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నగరి టీడీపీ శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా జాతీయ మహిళా కమిషన్ తో పాటు ఆంద్రప్రదేశ్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించ పరిచే విధంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని రోజా కమిషన్ని కోరారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి మాజీ మంత్రి రోజాపై అసభ్యకరమైన భాషలో కించపరుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో పాటు పలు మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి. రోజాకు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ విషయంపై ఆర్కే రోజా నగరి పోలీస్ స్టేషన్లో గాలి భానుప్రకాష్ పై ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలిదించుకునేలా మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన గాలి భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని రోజా నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదుపై నగరి పోలీసులు స్పందించడక పోవడంతో రోజా తన ఎక్స్ ఖాతాలో ఆవేదన చెందారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలపై తాను గొంతెత్తుతున్నందుకే టీడీపీ శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ అసభ్యంగా దుర్భాషలాడుతూ నన్ను బాధపెట్టాలని చూశాడని రోజా ఆరోపించారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదని అధికారపక్ష అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతి మహిళకు జరిగిన అవమానమని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సంస్కృతని, ఇటువంటి పాలన ఉన్న రాష్ట్రంలోనే మనం నివసిస్తున్నదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఆర్కేరోజా డిమాండ్ చేశారు.
