Former YSRCP MLA Bolla Brahmanaidu: వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో..
బొల్లా బ్రహ్మనాయుడు పరారీలో..

నరసరావుపేటలోని నివాసంలో పోలీసుల తనిఖీలు
Former YSRCP MLA Bolla Brahmanaidu: హైదరాబాద్ శివారు గండిపేటలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాజేయడానికి నకిలీ జీవోలు సృష్టించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అండ్ గ్యాంగ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ పోలీసులు ఏపీలోని నరసరావుపేటలో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించగా, ఆయన అక్కడ లభ్యం కాలేదు.
ఈ కేసులో బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. నిందితులు మొదట హైదరాబాద్‌లో ఉండి, తర్వాత కేరళ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను పంపి గాలింపు చేపట్టినా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బ్రహ్మనాయుడు అండ్ కో భూములను కబ్జా చేసి వెంటనే విక్రయించేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఒక పార్టీని వెతికినట్లు సమాచారం. అయితే, నకిలీ జీవోల వ్యవహారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ జీవోలను మొదట సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరనే అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వెలుగులోకి మరో వైకాపా నేత ప్రమేయం?
నకిలీ జీవోలు సృష్టించిన రాధాకృష్ణ నేపథ్యం, ఆయన పరిచయాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. మోసాల ద్వారా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న రాధాకృష్ణ బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలించగా, కడప జిల్లాకు చెందిన ఓ వైకాపా నేత పేరు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆ నేత రాధాకృష్ణ నివసించే రిచ్‌మండ్ విల్లాల సముదాయంలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు నిందితులను త్వరగా అరెస్టు చేసి పూర్తి విషయాలను వెల్లడించాలని ప్రజలు ఆశిస్తున్నారు.

