NCBN : ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు జుగుప్సాకరం
మహిళలను అవమానపరచడం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉంది - చంద్రబాబు

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని, ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ సీయం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదు. మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని సీయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని చంద్రబాబు విమర్శించారు. వారి ఘోర ఓటమికి ఇలాంటి పోకడలు ఒక కారణమని తెలిసినా వారి సహజ గుణంలో మార్పు రావడం లేదన్నారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? ఇది రాజకీయమా? మహిళలు, మహిళానాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రణాళికాబద్దంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు ఉంటాయని సీయం చంద్రబాబు హెచ్చరించారు.
