ఈనెల 26న అఖండగోదావరి ప్రాజెక్టుకు శంకుస్ధాపన
ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

అఖండ గోదావరి పర్యటక ప్రాజెక్టుకు ఈ నెల 26వ తేదీన శంకుస్ధాపన చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జూన్ 26వ తేదీన జరిగే ఈ శంకుస్ధాపన కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్, రాజమండ్రీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరిలు ముఖ్య అతిధులుగా విచ్చేస్తారని మంత్రి దుర్గేష్ చెప్పారు. రూ.94.44 కోట్ల అంచనాతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త అందాలు సంతరించుకుంటాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పుష్కర ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని ముందుగా పుష్కర ఘాట్ల సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి అన్నారు. చారిత్రాత్మక హేవలాక్ వంతెనకు కొత్త సొబగులు అఖండ గోదావరి ప్రాజెక్టు వల్ల వస్తాయన్నారు. కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అలాగే పుష్కఘాట్లు అన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతాయన్నారు. గోదవరి తీర ప్రాంతాలన్నీ సుందకీరణ పొందుతాయని, నిడదవోలు సమీపంలో ఉన్న కోట సత్తెమ్మ తల్లి ఆలయం అభివృద్ది చెందుతుందన్నారు. గోదావరి కాలువలు, బ్రడ్జిలంకల్లో బోటింగ్, టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరికి నిత్య హరతి కొనసాగుతుందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు గోదావరి తీర ప్రాంతాలు సందర్శించే పరిస్ధితి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే ఏపీ పర్యాటకాభివృద్ధికి కేంద్రం నుంచి దాదాపు రూ.375 కోట్ల నిధులు తీసుకు వచ్చినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
