Nara Lokesh: పీవీ సింధు క్రీడా అకాడమీకి భూమిపూజ.. ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తాం: నారా లోకేశ్
నారా లోకేశ్

Nara Lokesh: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం భూమిపూజ చేశారు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోందని అన్నారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు. ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లోనే పట్టుదల, క్రమశిక్షణతో సింధు ఒలింపిక్స్ పతక విజేతగా, ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగారని ఉద్ఘాటించారు. ప్రతి ఛాంపియన్ వెనుక కష్టపడిన తల్లిదండ్రులు, ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచే కోచ్‌లు ఉంటారని అన్నారు.
కేవలం బ్యాడ్మింటన్‌కే పరిమితం కాకుండా స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ తదితర క్రీడలకు కూడా ఈ అకాడమీ నిలయంగా మారనుందని వెల్లడించారు. ఆస్ట్రేలియా, ఖతార్ తరహాలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఈ సంస్థ వేదిక కానుందని తెలిపారు. 90వ దశకంలోనే క్రీడలపై సీఎం చంద్రబాబు నమ్మకం ఉంచారని, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యం కల్పించి క్రీడా విప్లవానికి బాటలు వేశారని గుర్తు చేశారు. తరగతి గది జ్ఞానాన్ని ఇస్తే, క్రీడలు వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను నేర్పుతాయని చెప్పారు. అందుకే ఏపీలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా ప్రకటించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీవీ సింధు కూడా మాట్లాడారు. ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని అన్నారు. ఈ క్రీడా ప్రాజెక్ట్ రూపకల్పనలో తనకు అండగా నిలిచి, పూర్తి మద్దతు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, ఏడు ప్రధాన క్రీడా విభాగాలు, నూతన క్రీడాంశాలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్‌ను ఒలింపిక్స్ పోటీల్లో వాడే ఇటలీ ‘మిర్తా పూల్స్’ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
మంత్రి నారా లోకేశ్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

