Police Commissionerates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతి నగరాల్లో కొత్తగా నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం నాలుగు వేర్వేరు ఉత్తర్వులు వెలువరించారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కమిషనరేట్లకు ఐజీ/డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తారు. బీఎన్‌ఎస్‌ఎస్ (BNSS) 2023 సెక్షన్ 14(6) ప్రకారం వీరికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు కల్పించారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ, పోలీస్ జిల్లాల సరిహద్దులే నూతన కమిషనరేట్ల సరిహద్దులుగా ఉంటాయి. కొత్త పోస్టులు సృష్టించకుండా వివిధ విభాగాల్లో అదనంగా ఉన్న క్యాడర్ పోస్టులను సర్దుబాటు చేసి కేటాయించారు.

గుంటూరు పోలీస్ కమిషనరేట్: గుంటూరు, గుంటూరు రూరల్, రాజధాని అమరావతి ప్రాంతం, తెనాలి జోన్లతో ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, గుంటూరు రూరల్, తుళ్లూరు, మంగళగిరి, తెనాలి సబ్‌డివిజన్లు ఇందులో భాగం. శిక్షణ విభాగం డీఐజీ పోస్టును గుంటూరు పోలీస్ కమిషనర్‌గా మార్చారు. ఐదుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు కేటాయించారు.

రాజమహేంద్రవరం పోలీస్ కమిషనరేట్: మూడు శాంతిభద్రతల విభాగాల జోన్లతో ఏర్పాటు. సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, కొవ్వూరు సబ్‌డివిజన్లు అంతర్భాగం. టెక్నికల్ విభాగం డీఐజీ పోస్టును కమిషనర్ పోస్టుగా మార్చారు. నలుగురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు కేటాయించారు.

కర్నూలు పోలీస్ కమిషనరేట్: రెండు శాంతిభద్రతల విభాగాల జోన్లతో ఏర్పాటు. కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్‌డివిజన్లు భాగం. పర్సనల్ అండ్ ఆర్గనైజేషన్ విభాగం డీఐజీ పోస్టును కమిషనర్‌గా మార్చారు.

తిరుపతి పోలీస్ కమిషనరేట్: తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ జోన్లతో ఏర్పాటు. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, శ్రీసిటీ, పుత్తూరు, నాయుడుపేట సబ్‌డివిజన్లు ఇందులో ఉన్నాయి. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ పోస్టును తిరుపతి కమిషనర్‌గా మార్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్, క్రైమ్, వీఐపీ భద్రత, శాంతిభద్రతల సమర్థ నిర్వహణ కోసం ఈ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. మెరైన్ వింగ్ ఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ, విజయవాడ ట్రాఫిక్ డీసీపీ, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ వంటి పోస్టులను వివిధ డీసీపీలుగా మార్చారు. జిల్లాలోని అదనపు ఎస్పీ, డీఎస్పీ పోస్టులను అదనపు డీసీపీలు, ఏసీపీలుగా పునర్నియామకం చేశారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పోలీస్ పరిపాలన మరింత సమర్థవంతంగా జరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Next Story