Minister Nara Lokesh: కిరాణ కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు.. సింగిల్ పోర్టల్‌తో అనుమతులు : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల పరిశ్రమలకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేశ్, టీజీ భరత్ హాజరయ్యారు.
లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరగా ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు ట్రాక్ చేసి శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతినెలా ప్రధాన ప్రాజెక్టుల భూమిపూజ, ప్రారంభోత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నవంబర్‌లో నిర్వహించే భాగస్వామ్య సదస్సు నాటికి సాధ్యమైనంత ఎక్కువ పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గత సమిట్‌కు మించి ఈసారి ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను ఆకర్షించేందుకు విదేశాలు, దేశవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిని ప్రతి 15 రోజులకోసారి కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించాలని సూచించారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ పరిశ్రమలతో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న ఎంఎస్‌ఎంఈలను ఆన్‌బోర్డు చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ఎక్కువ హోటల్ గదులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
స్లరీ పైప్‌లైన్ అవసరంపై అధ్యయనం చేయాలని, ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అందించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. టెక్స్‌టైల్ పరిశ్రమలకు బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇవ్వడం, ఉక్కు హబ్‌గా అభివృద్ధి చేస్తున్న అనకాపల్లి-విశాఖ-విజయనగరం జిల్లాల్లో మరిన్ని ఉక్కు పరిశ్రమలు ఆకర్షించడం, గార్మెంట్ పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
వేగం, స్థిరత్వం, సర్వీస్‌లు ప్రభుత్వ ప్రత్యేకతలని లోకేశ్ స్పష్టం చేశారు. సులభతరమైన సర్వీస్ డెలివరీ అందించాలని అధికారులను కోరారు.

