Chandrababu: గాంధీజీ, శాస్త్రి జయంతి నివాళులు.. మదనపల్లెలో రాయలసీమను ఫ్రూట్ బౌల్‌గా మార్చే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

Chandrababu: గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని తెలిపారు. స్వచ్ఛమైన, స్వావలంబనతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర నిర్మాణంలో గాంధీజీ చూపిన బాటలో నడవాలని సూచించారు. నిరాడంబరత, దేశభక్తి, నిజాయతీకి లాల్‌బహదూర్ శాస్త్రి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. సైనికులు, రైతుల సేవలను గుర్తిస్తూ ఆయన ఇచ్చిన ‘జై జవాన్-జై కిసాన్’ నినాదం దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉందని, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన చూపిన నాయకత్వం అందరికీ ఆదర్శమని అన్నారు.
ఇదే రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యాన హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ)కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ దశ, దిశ మార్చేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తీసుకొచ్చామని సీఎం అన్నారు. కరవు నేలగా ఉన్న సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘‘ప్రాథమిక రంగం వృద్ధిలో హార్టికల్చర్‌ది కీలకపాత్ర. పండ్ల తోటల సాగులో మంచి అవకాశాలు ఉన్నాయి. 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తాం. ప్రకృతి సేద్యంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. సాగునీరు ఇస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండిస్తారు. ఉత్పత్తికి మార్కెట్ సౌకర్యమిస్తే సంపద సృష్టిస్తారు. 20 రకాల పంటల్లో ఏ పంట అయినా పండించే సత్తా సీమ రైతులది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో పంటలు, ధరల స్థిరీకరణ జరగుతుంది. ఎన్టీఆర్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నాం. హంద్రీనీవా ద్వారా నీళ్లు రాకపోతే మదనపల్లె మొత్తం వలసపోయేది. సీమ పరిస్థితులను మార్చేందుకు డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పంటకుంటలు, వాటర్‌షెడ్ పథకాలు ఏర్పాటు చేసి జలసంరక్షణకు ప్రాధాన్యమిచ్చాం. రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తిచేసి మూడేళ్లలో జాతికి అంకితమిచ్చే బాధ్యత మాది. రాయలసీమలో హంద్రీనీవా ఫేజ్-2, వెలిగొండ ఫేజ్-2, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.
ఈ సందర్భంగా అనంత్ అంబానీని సీఎం ప్రశంసించారు. ‘‘అనంత్ అంబానీ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. పర్యావరణ పరిరక్షకుడు. జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల్లో జంతువుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిపై భక్తితో ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చారు. 2035 నాటికి రిలయన్స్ సంస్థను నెట్ జీరో కార్బన్ సంస్థగా మార్చాలని ముందుకెళ్తున్నారు. రాయలసీమలో ఐఎస్‌ఏ ఏర్పాటుకు ఆయన ముందుకు రావడం చాలా సంతోషం. వంతారా మాదిరిగా ఐఎస్‌ఏను తీర్చిదిద్దాలని అనంత్‌ను కోరుతున్నా’’ అని అన్నారు. అనంత్ అంబానీని ‘ఆంధ్ర ముద్దుబిడ్డ’గా అభివర్ణించారు. కార్యక్రమంలో ‘నన్ను మీ ఆంధ్ర బిడ్డగా భావించండి’ అని అనంత్ కోరడంపై సీఎం ఇలా స్పందించారు.

