Goa Governor Ashok Gajapathi Raju’s Sarcastic Remark: పాలు లేకుండానే నెయ్యి తయారు చేసే 'శాస్త్రవేత్తలు' ఈ రోజుల్లో పుట్టుకొచ్చారంటూ గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది మహానుభావుల గొప్పతనమేనని ఆయన ఎద్దేవా చేశారు. విజయనగరం కోటలోని మాన్సాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ లక్ష్మీపతిరాజు అధ్యక్షతన ఆదివారం ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు కల్తీ నెయ్యి సరఫరా విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రసాయనాలతో నెయ్యి తయారీపై ఇటీవల చర్చలు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

'చట్టాలు మంచివారి చేతిలో ఉంటే మంచి జరుగుతుంది, చెడ్డవారి చేతిలో పడితే చెడు సంభవిస్తుంది' అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులను బడికి దూరం చేశారని, విద్యారంగ అభివృద్ధికి ఏర్పాటైన మాన్సాస్ ట్రస్టును కూడా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. ట్రస్టును ఇబ్బందిపెట్టిన వ్యక్తి సైతం ఇదే విద్యాసంస్థల్లో చదువుకున్నాడని, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలకు మాన్సాస్ భూమి దానం

విజయనగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు మాన్సాస్ ట్రస్టు భూమిని ఇచ్చిందని ఛైర్మన్ అశోక్ గజపతిరాజు వెల్లడించారు. అయితే, గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ఈ సంస్థపై 'అప్పులు మీవి.. ఆస్తులు మావి' అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. గతంలో తనను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తామని బెదిరించారని, అయినప్పటికీ భయపడకుండా ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాన్సాస్ ట్రస్టు సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story