మొగల్తూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు


CM Chandrababu: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి మరింత మెరుగుపడాలని, అందుకోసం ప్రజలు సలహాలు, సూచనలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాలు పేదవాడిని నిలబెట్టాలని, తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాకుండా శాశ్వత మద్దతు ఉండాలని సీఎం అన్నారు. “ఆడ బిడ్డలు ఎక్కడికైనా వెళ్లాలన్నా ఉచిత బస్సులు అందుబాటులోకి తెచ్చాం. దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు అందిస్తున్నాం. పేదల సేవ కోసమే మొగల్తూరు వచ్చాను” అని చంద్రబాబు చెప్పారు.

సీఎం స్థాయిలో అనేక మార్పులు చేశానని, ఎంత సేవ చేసినా ప్రజల రుణం తీర్చుకోలేనని ఆయన స్పష్టం చేశారు. అనేక సంస్కరణలకు నాంది పలికామని, ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు. వైకాపా హయాంలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పారు.

45 సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళా కండక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టామని, త్వరలో మహిళా డ్రైవర్ల వ్యవస్థను కూడా తీసుకొస్తామని ప్రకటించారు. వడ్డెర సమాజిక వర్గానికి మైనింగ్ లీజులు ఇచ్చామని, గౌడ్ కులానికి మద్యం షాపులు కేటాయిస్తున్నామని తెలిపారు.

డీఎస్సీపై వైకాపా 350 కేసులు వేసిందని, అయితే వైకాపా చేస్తున్న ప్రచారాన్ని డీఎస్సీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని సీఎం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచామని, పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నొక్కి చెప్పారు. “పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుంది” అని చంద్రబాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story