CM Chandrababu: పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకున్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ చారిత్రక కార్యక్రమం జరిగింది. సీఎం రెగ్యులేటర్‌ను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు. ముందుగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ గోదారమ్మకు జలహారతి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, అచ్చెన్నాయుడు, ఎంపీ సి.ఎం.రమేశ్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “అనకాపల్లి బెల్లమంత తియ్యగా ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. నిండు మనసుతో దీవెన ఫలితంగానే అనకాపల్లికి గోదారమ్మ వచ్చింది. వెలిగొండతో కృష్ణమ్మను తరలించి మార్కాపురం జిల్లాకు నీళ్లిచ్చాం. తూర్పు కనుమలు, అడవులు, నదులు, హైవేలను దాటుకుని ఉత్తరాంధ్రకు గోదావరి వచ్చింది. వచ్చే ఏడాది నాటికి సింహాద్రి అప్పన్న, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి చెంతకూ గోదావరి జలాలు తీసుకెళ్తాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీళ్లిచ్చి జలహారతితో తెలుగుతల్లి రుణం తీర్చుకుంటాం. గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం” అని అన్నారు.
సీఎం మరోసారి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, 2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి రావడం పోలవరానికి శాపమైందని, 2024లో ప్రజలు కూటమిని గెలిపించి శాపవిముక్తి చేశారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా భావిస్తున్నట్లు చెప్పిన సీఎం, ఎడమ కాలువను విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని, 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. “అందరూ అసూయపడేలా అనకాపల్లి జిల్లా అభివృద్ధి చెంది మరో రంగారెడ్డి అవుతుంది. ఉత్తరాంధ్ర.. ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర కావడం ఖాయం” అని సీఎం స్పష్టం చేశారు.

