CM Chandrababu: అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలు మాత్రమే కాదు.. స్వచ్ఛమైన ప్రాంతాలు కూడా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో పర్యటించిన సీఎం ప్రజావేదికలో మాట్లాడారు.

సెప్టెంబరు తొలివారంలోనే అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి జలాలు తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ‘మన ఊరు-మన బాధ్యత’ సంకల్పం అందరూ తీసుకోవాలని సూచిస్తూ, స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని తెలిపారు. 2047 నాటికి ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ అగ్రదేశంగా వెలుగొందుతుందని, తలసరి ఆదాయం రూ.50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయని సీఎం వివరించారు. స్టీల్‌ సిటీ నిర్మాణం కాబోతోందని, డేటా సెంటర్లు వస్తున్నాయని, భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతోందని అన్నారు. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గూగుల్‌ డేటా సెంటర్‌ సుందరమైన విశాఖకు వస్తోందని, మన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతే.. ఇక్కడుండే కొద్దిమంది మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

డేటా సెంటర్‌ ప్రారంభం కాకముందే నీళ్లు ఇంకిపోయాయంటూ, తాగడానికి నీళ్లు లేవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. డేటా సెంటర్‌ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉండబోతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్‌ నింపే బాధ్యత తమదేనని, ప్రతి గ్రామం జీరో వేస్ట్‌ పంచాయతీగా తయారు కావాలని సూచించారు.

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రాంతాన్ని చెత్తమయం చేశారని ఆరోపిస్తూ, గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు ఊపందుకున్నాయని చెప్పారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛరథాలను పంపుతున్నామని, ఇంటిపై సోలార్‌ ప్యానెల్‌ పెట్టుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదని సీఎం వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story