ప్రధాని మోదీతో ఫోన్‌ సంభాషణలో ఆనందం వ్యక్తం చేసిన పిచాయ్

Google CEO Sundar Pichai: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం లాగింది. ఈ అవకాశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ జరిపారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్‌లో తొలి ఏఐ హబ్ వివరాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ తన ఎక్స్ (పాత Twitter) పోస్ట్‌లో పంచుకున్నారు.

ఈ ఒప్పందం భారత టెక్నాలజీ రంగంలో మరో మైలురాయి. విశాఖపట్నం గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌గా మారనుందని పిచాయ్ ఆనందం వ్యక్తం చేశారు. "ప్రధాని మోదీతో విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ప్రణాళికల గురించి చర్చించాను. ఇది భారత్‌కు కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ హబ్‌లో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్‌స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వేలు, పెద్ద ఎత్తున ఇంధన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతాయి. ఈ సౌకర్యాల ద్వారా అధునాతన సాంకేతికతలను భారతీయ సంస్థలు, వినియోగదారులకు అందించి, కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలను వేగవంతం చేస్తాము" అని పిచాయ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

దీనికి సంబంధించి దిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌లు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రానున్న ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది భారత్‌లో గూగుల్ చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి.

ఈ ఒప్పందం సందర్భంగా మాట్లాడిన గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్, "విశాఖపట్నం గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారనుంది. ఇక్కడి నుంచి 12 దేశాలతో సబ్‌సీ కేబుల్‌ల ద్వారా అనుసంధానం ఏర్పాటు చేస్తాము. ఇది భారత్‌లో ఏఐ మరియు క్లౌడ్ టెక్నాలజీల అభివృద్ధికి దోహదపడుతుంది" అని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలను పెంచి, రాష్ట్రాన్ని టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం, భారత్‌లోని టెక్ ఇండస్ట్రీకి కీలక కేంద్రంగా నిలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story