Jagan: కరవు నివారణలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం: జగన్ ఘాటు విమర్శ
జగన్ ఘాటు విమర్శ

Jagan: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల కాకుండా మానవ నిర్మిత కరవు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎల్‌నినో వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయని ఫిబ్రవరి 4నే సీఎం చంద్రబాబు చెప్పినా, ఆ తర్వాత నివారణ చర్యల్లో ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు.
గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జగన్... జూన్ నుంచి వరుస నెలల్లో లోటు వర్షపాతం ఉన్నా కరవు మండలాలను ఇప్పటివరకు ప్రకటించకపోవడాన్ని ప్రశ్నించారు. ‘నీళ్లిస్తున్నాం, సాగు చేసుకోండి’ అని జులై 11న సీఎం, మంత్రులు చెప్పడంతో రైతులు సాగు ప్రారంభించారు. దీంతో 56.4 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. 2023 ఖరీఫ్ పంట బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,400 కోట్లను 2024 జూన్‌లో చంద్రబాబు చెల్లించి ఉంటే రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల మేలు జరిగేదని, కానీ చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం రాజీపడిందని జగన్ విమర్శించారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తే 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. కానీ కేంద్రం 41.15 మీటర్లకు కుదిస్తే చంద్రబాబు అంగీకరించారు. దీంతో 120 టీఎంసీల నీటి నిల్వ అవకాశం, కేంద్రం భరించాల్సిన రూ.60 వేల కోట్లలో సుమారు రూ.30 వేల కోట్లు కోల్పోయారు. పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు నీరు తీసుకొచ్చినట్లు చంద్రబాబు డ్రామా చేశారని కూడా ఆయన అన్నారు.
కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేశారు.

