TOTAPURI MONGO : మామిడి కొనుగోళ్లలో ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు
ఇప్పటి వరకూ 3.08 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లు

- రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కేజీ రూ.12 లకు కొనుగోలు
- మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు
- కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజువారీ సమీక్ష
తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్ధ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రోజువారీగా మామిడి రైతుల నుంచి ఏ మేర కొనుగోళ్లు జరిగాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మొత్తంగా ఈ సీజన్ లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులుతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలకు దిశా నిర్దేశం చేశారు. రైతుల నుంచి యూనిట్ సామర్ధ్యం మేరకు మామిడి కాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు. రైతులకు అదనంగా కేజీకి రూ.4 రూపాయల మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి రూ.8 చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్ప్ పరిశ్రమల వద్ద గత ఏడాది మిగిలి పోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం రూ.130 కోట్లను విడుదల చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
