Government of Andhra Pradesh: సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి కట్టడి: ప్రభుత్వం కఠిన చర్యలు
ప్రభుత్వం కఠిన చర్యలు

Government of Andhra Pradesh: సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటి దుర్వినియోగాలను కట్టడి చేయడానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలా లేదా ఇతర దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, చట్టాలను అధ్యయనం చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థసారథి ఈ విషయాలను వెల్లడించారు.
‘ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వెర్రితలలు వేస్తోంది. వాటికి ఎలాంటి బాధ్యతా లేదు. పాలనా వ్యవస్థ, ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే స్థాయిలో దీని ప్రభావం ఉంది. అయితే ప్రింట్, టీవీ వంటి సాంప్రదాయ మీడియాకు చట్టపరమైన జవాబుదారీతనం, నైతిక ప్రమాణాలు ఉన్నాయి’ అని మంత్రి పేర్కొన్నారు.
మహిళలు, మైనర్లపై సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అవమానకర ప్రచారాలు, అసభ్యకర పోస్టులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాలపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సీఎం సూచనలు:
రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.
దుర్వినియోగం, విద్వేషం, వ్యక్తిత్వ హననానికి పాల్పడే హ్యాండిళ్లను గుర్తించడానికి ఆధునిక టూల్స్ సమకూర్చుకోవాలి.
సైబర్ దర్యాప్తు నైపుణ్యం కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి. అవసరమైతే సైబర్ నిపుణులను పోలీసు శాఖకు అనుసంధానం చేయాలి.
వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులు, చట్టాలపై అధ్యయనం చేసి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి రాష్ట్రానికి అనుగుణమైన చట్టపరమైన, పాలనా చర్యలు తీసుకోవాలి.
ఈ నిర్ణయాలు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టి, సమాజంలో సామరస్యాన్ని కాపాడటంలో కీలకమవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

