Government of Andhra Pradesh: ఏపీలో తల్లికి వందనం: ఈ నెల 22న నిధులు విడుదల
నిధులు విడుదల

Government of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 22వ తేదీన ‘తల్లికి వందనం’ పథకం కింద నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం రూ.10,120.78 కోట్లు చెల్లించేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పథకం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుల్లో చదువుతున్న ప్రతి చిన్నారికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేలు, పాఠశాల నిర్వహణకు రూ.2 వేలు ఖర్చు చేస్తోంది. ఈ పథకం ద్వారా సుమారు 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. 42.70 లక్షల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలను ప్రభుత్వం ఇప్పటికే వెరిఫై చేసింది. అర్హులైన వారి జాబితాను జూలై 22న స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రకటించి అదే రోజు వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న 1వ తరగతి నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అర్హత ఆధారంగా ఆగస్టు 30 నాటికి ఆర్థిక సాయం అందించనుంది.
అంగన్‌వాడీలు, శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న వారి పిల్లలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా వారిని అర్హుల జాబితాలో చేర్చుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాల తల్లులకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు విద్యా సాక్షరతను మరింత పెంచడం లక్ష్యం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సకాలంలో అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తును సురక్షితం చేస్తోంది.

