Minister Nara Lokesh: త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్.. ఎన్డీఏకు రుణం తీర్చుకుంటున్నాం: మంత్రి నారా లోకేశ్
ఎన్డీఏకు రుణం తీర్చుకుంటున్నాం: మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: ఎన్డీఏను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఐదో తరం యుద్ధ విమానాలు (ఫైటర్ జెట్లు) తయారీ జరగనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, “కరవు నేలపై కార్ల తయారీ పరిశ్రమలు తీసుకొచ్చిన మూడు అక్షరాల వ్యక్తి సీబీఎన్. ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమలను ఈ ప్రాంతానికి తెచ్చిన వ్యక్తి కూడా సీబీఎన్ మాత్రమే. ఒకప్పుడు పుట్టపర్తిలో వంద ఇళ్లు కూడా లేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రపంచానికి అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి మారింది. 1991లో సత్యసాయి బాబా ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయన విజన్ ఇప్పుడు సాకారమవుతోంది” అని చెప్పారు.
“డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. దేశంలో నమో అంటే నరేంద్ర మోదీ.. ఏపీలో నాయుడు, మోదీ జోడీ. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు — ముగ్గురూ 75 ఏళ్లు పైబడినా 25 ఏళ్ల యువకుల్లా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోంది. రాయలసీమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. 23 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉంటుందో చూపించాం” అని లోకేశ్ ఉద్ఘాటించారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

