Nara Lokesh: మంగళగిరిలో 372 మందికి ఇంటి పట్టాలు పంపిణీ.. 80 శాతం సమస్య పరిష్కారం: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గంలో 80 శాతం ఇంటి పట్టాల సమస్య పరిష్కారమైందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా 372 మంది లబ్ధిదారులకు ఉచితంగా ఇంటి పట్టాలను మంత్రి చేతులమీదుగా పంపిణీ చేశారు.
దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు అందించడం ద్వారా ఆస్తి హక్కులు కల్పించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 5,636 మందికి పట్టాలు పంపిణీ చేసి రూ.2 వేల కోట్ల విలువైన భూములకు హక్కులు కల్పించామని లోకేశ్ చెప్పారు. తొలి విడతలో 3,002 మందికి, రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశామని ఆయన వెల్లడించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ భూముల్లో నివసిస్తున్న వారికి వివిధ శాఖల సమన్వయంతో పట్టాలు అందించామని పేర్కొన్నారు.
ప్రజలు ఇచ్చిన మెజారిటీ కారణంగానే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సొంత నిధులు కూడా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా మరోసారి గెలవాలని పట్టుదలతో ముందుకెళ్లానని, పట్టాల సమస్య పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరిలో పునాది వేసిన ఈ కార్యక్రమాన్ని విశాఖ, విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. త్వరలో విజయవాడలో 24 వేల ఇంటి పట్టాలు అందిస్తామని, వచ్చే ఏడాది 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లోగా ప్రతి ఇంటికీ తాగునీరు, భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామని, 2029 నాటికి నియోజకవర్గంలో అర్హులందరికీ పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భూముల సమస్యలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. నిడమర్రు స్కూల్‌ను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, ఆ తరహాలోనే మిగతా పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు.

