ఏపీ సాధుపరిషత్తు అధ్యక్షుడు ఆగ్రహం

AP Sadhu Parishad President Expresses Anger: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం భక్తుల మనసులను కలచివేస్తోంది. వైకాపా పాలన కాలంలో భక్తులు తిరుమల నుంచి ఇంటికి తీసుకొచ్చే లడ్డూలు ప్రయాణంలోనే విరిగిపోయేవని, రుచి కూడా మారిపోయేదని, అంతకుముందు అలాంటివి జరగలేదని ఏపీ సాధుపరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు.

విశాఖపట్నంలోని అల్లిపురంలో సోమవారం ఏపీ సాధుపరిషత్తు ఆధ్వర్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. "తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం ఎంత పవిత్రమో, లడ్డూ ప్రసాదం కూడా అంతే పవిత్రంగా భక్తులు భావిస్తారు. అలాంటి పవిత్ర ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో కోట్లాది లడ్డూలు తయారు చేసినట్లు సిట్ నివేదిక బయటపెట్టడం చూస్తే గుండె దడదడలాడుతోంది. స్వామి సన్నిధిలో ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారు?" అని ఆయన ప్రశ్నించారు.

సిట్ నివేదికలో పేర్కొన్న బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి తాత్సారం చేయకూడదని స్పష్టం చేశారు. "కల్తీ జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరినీ వదలడు. వడ్డీతో సహా చెల్లించేస్తాడు" అని ఆయన హెచ్చరించారు.

రసాయనాలు కలపడం వల్ల కోట్లాది హిందూ భక్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా లడ్డూ విషయంపై జరుగుతున్న రాజకీయ చర్చలు బాధ కలిగిస్తున్నాయని, దీన్ని రాజకీయ అంశంగా చూడకుండా సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని శ్రీనివాసానంద సరస్వతి సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story