అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్‌ మృతికి ఘన నివాళి అర్పించిన కేటీఆర్‌

సభలో దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ కి సంతాపం తెలపాల్సి వస్తుందని నేను ఏనాడు అనుకోలేదని ఇది అత్యంత విషాదకరమైన విషయమని బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపానాథ్‌కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ గోపన్న తన అనారోగ్యం గురించి ఏనాడు ఎవరికీ చెప్పుకోలేదని, జూబ్లీహిల్స్‌ ప్రజల కోసం చివరి వరకూ పాటు పడ్డారని గుర్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కేవలం ధనవంతులు మాత్రమే ఉంటారని అనుకుంటారని కానీ అది అనేక బస్తీలు కలిగిన పేదల నియమన్నారు. గోపన్న బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా నియోజకవర్గంలో పేదల కోసం పనిచేశారన్నారు. హైదరాబాద్‌లో పుట్టి ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసి, ఎన్టీఆర్‌ నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రాముడు, కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ నిలువెత్తు కటౌట్‌ మొదటి సారిగా పెట్టింది గోపీనాథే అని గుర్తు చేశారు. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన సొంత ఇంటి పరిస్ధితి చూస్తే ఆశ్చర్యం కలిగిందన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చే సాంప్రదాయాన్ని గోపన్న తన నియోజకవర్గంలోనే ప్రారంభించారన్నారు. ఆయనపై ఎన్ని ఒత్తిడులు వచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీ మారకుండా విలువలకు కట్టుబడ్డారని కొనియాడారు. గోపన్న మరణం మా పార్టీకి, ఆయన కుటంబానికి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు. గోపీనాథ్‌ కుటుంబానికి పార్టీ తరపున సానుభూతి తెలియజేశారు. గోపన్న కుటుంబానికి మాపార్టీ అండగా ఉంటుందని వారి యోగక్షేమాలు మేము చూసుకుంటామని కేటీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story