విజయవాడ ఉత్సవ్ 2.0 ముగింపు వేడుకల్లో మెగా కార్నివాల్ ప్రారంభం


Chandrababu Naidu: అంగరంగ వైభవంగా సాగిన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెగా కార్నివాల్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శంఖం పూరించి సాంస్కృతిక కవాతుకు స్వాగతం పలికారు.కాకరపర్రు, కడియం పూలతో అలంకరించిన విజయవాడ ఉత్సవ్ రథంతో కార్నివాల్ ప్రారంభమైంది. వివిధ రకాల పూలతో అమ్మవారి చిత్రాన్ని తీర్చిదిద్దారు. గుర్రాలు, ఒంటెలు, డప్పు-సన్నాయి వాయిద్యాలు, గరడి కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవం, ఐక్యతను చాటిచెప్పేలా సాంస్కృతిక కవాతు సాగింది. ఏలూరు రోడ్ సందడిగా మారింది. కళాకారుల ప్రదర్శనలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ముగింపు వేడుకల్లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు... కరవును జయించే శక్తి ఇవ్వాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0ను రాష్ట్ర కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, పర్యాటకాన్ని పెంచడానికి, స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారికి అవకాశాలు కల్పించడానికి నిర్వహించినట్లు అన్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య గతేడాది కంటే రెండు లక్షలు పెరిగిందని చెప్పారు.దసరా శరన్నవరాత్రి ముగింపు వేడుకల సందర్భంగా కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కృష్ణమ్మకు పూజలు చేశారు. భక్తులు, అధికారులు కృష్ణవేణి నదీహారతులను తిలకించారు.తమిళనాడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి ఎంత ముఖ్యమో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.

Next Story