CM Chandrababu: ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే అభివృద్ధి, పాలన కూడా పెండింగ్‌లో ఉన్నట్లేనని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పాలనకు కొత్త దిశనిర్దేశం చేస్తూ, అధికార యంత్రాంగంలో లీడర్‌షిప్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగిస్తూ, అధికారులు, ఉద్యోగుల్లో నాయకత్వ పటిమ పెరిగితేనే ప్రజలకు పాలన వేగంగా, సమర్థంగా అందుతుందని అన్నారు. ఈ సదస్సులో తొలిసారిగా లీడర్‌షిప్‌పై ప్రత్యేక సెషన్‌ను అజెండాలో చేర్చినట్లు తెలిపారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నాయకత్వమే కీలకమని నొక్కి చెప్పారు.

గత ప్రభుత్వ మద్యం విధానంలో జరిగిన అక్రమాలను సీఎం లేవనెత్తారు. గత ప్రభుత్వం మార్కెట్‌లోకి తెచ్చిన జే బ్రాండ్ కల్తీ మద్యం వల్ల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ఆరోపించారు. ఆ కల్తీ మద్యం బ్రాండ్లన్నింటినీ రద్దు చేసి, ప్రస్తుతం పారదర్శకంగా, నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకొచ్చామని, ఆర్థిక ప్రగతిని ప్రతి నెలా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. 2022-23ను బేస్ ఇయర్‌గా తీసుకుంటే ప్రస్తుత ధరల ప్రకారం 13.44 శాతం వృద్ధి నమోదైందని, జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే రూ.25,450 కోట్లు పెరిగాయని తెలిపారు. వనరులు, టెక్నాలజీ ఉన్నా కొన్ని చోట్ల లోపం ఉందని చెబుతూ, రియాక్టివ్ గవర్నెన్స్‌కు స్వస్తి చెప్పి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అందించాలని అధికారులను ఆదేశించారు.

ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ కుట్రలకు అధికారులు వేగంగా కౌంటర్ ఇవ్వాలని సీఎం సూచించారు. డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి తప్పు జరగలేదని, స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చామని తేల్చి చెప్పారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన ఇద్దరు మహిళా అధికారులను అభినందించారు. సరైన సమయంలో స్పందించకపోతే ఆ నష్టం ప్రభుత్వానికే చుట్టుకుంటుందని హెచ్చరించారు.

సమీక్షలకే పరిమితం కాకుండా ఫలితాలపై దృష్టి పెట్టాలని, ప్రతి జిల్లాలో 25 టాప్ ప్రాజెక్టులు, ప్రతి నియోజకవర్గంలో 10-15 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించి అభివృద్ధి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి రాజీ ఉండదని, సంక్షోభ సమయంలో కలెక్టర్ల నాయకత్వ సామర్థ్యం బయటపడాలని అన్నారు. 2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని, జిల్లాలను గ్రోత్ ఇంజిన్లుగా మార్చి ఆదాయం, సంపద పెంచేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 13.44 శాతంగా ఉన్న వృద్ధిని 15 శాతానికి తీసుకెళ్లాలని, ఉత్తమ పద్ధతులు, కొత్త ఆలోచనలు, వేగవంతమైన పాలనతో ముందుకెళ్లాలని సూచించారు. రివ్యూల నుంచి రిజల్ట్స్ వైపు మారి.. వన్ స్టేట్-వన్ మిషన్-వన్ ఎయిమ్ అనేదే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యమని తేల్చి చెప్పారు.

ఇగోలు పక్కనపెట్టి ప్రజా సేవకులుగా పనిచేద్దామంటూ అధికారులకు సీఎం సలహా ఇచ్చారు. 27 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, సంక్షేమానికి రూ.1.40 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి చేశామని, పోలవరాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నీటి భద్రత, సాగునీటి రంగంలో చేస్తున్న కృషికి ‘వాటర్‌మ్యాన్’గా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్న సీఎం.. రాష్ట్ర ప్రగతి వెనుక మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఉందని స్పష్టం చేశారు.

Next Story