Lokesh: తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో నిలబడి మంత్రి నారా లోకేశ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తీవ్ర సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పిన లోకేశ్, గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే వాళ్లు తాము కాదని స్పష్టం చేశారు.

డీఎస్సీ నియామకాలపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవారు చర్చకు రావాలని ఆహ్వానించారు.

“జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరు. మేము సాక్షి క్యాలెండర్ కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. ఒక డీఎస్సీ నిర్వహించినా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అర్థమవుతుంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

పులివెందుల ఎమ్మెల్యే జగన్ బెంగళూరు-తాడేపల్లి-హైదరాబాద్ (బెంతాహై) వీడి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని, ప్రిజనరీ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని, మహిళల్ని కించపరిచే వారిని, తిట్టేవారిని తన చుట్టూ ఉంచుకుంటారని తీవ్ర విమర్శలు చేశారు. కోడిగుడ్డుకు, పరిశ్రమకు తేడా తెలియని వాళ్లను మంత్రులుగా చేయడం వల్లే పరిశ్రమలు పారిపోయాయని ఎద్దేవా చేశారు.

గుడివాడ అమర్‌నాథ్ అద్భుతంగా మాట్లాడినందుకు జగన్ కితాబు ఇవ్వడం దురదృష్టకరమని, భారతీరెడ్డిని, తన ఇద్దరు కుమార్తెలను హోం మంత్రిని అవమానించినట్లు అవమానించినా జగన్ శభాష్ అంటారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సంస్కృతి అలాంటిది కాదు కాబట్టే జగన్ కుటుంబ సభ్యుల్ని కించపరిచిన వారిపై చర్యలు తీసుకున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.

ఈ సవాల్ రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story