CM Nara Chandrababu Naidu: డిజిటల్‌ మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో కలిసి ఈ సదస్సులో పాల్గొన్నారు.

భారత్‌లో సింగిల్‌ పవర్‌ గ్రిడ్‌ ఉందని, అమెరికాలో కూడా ఇది లేదని సీఎం చెప్పారు. రోడ్‌ నెట్‌వర్క్‌లో భారత్‌ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని, రైల్వే నెట్‌వర్క్‌లోనూ కీలక స్థానం ఉందని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, రోడ్‌ నెట్‌వర్క్‌తో బలమైన దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవలో ఉన్న ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్‌ ఇన్‌ఫ్రా అభివృద్ధిలో ప్రధాని పాత్ర కీలకమని అన్నారు.

సీఐఐతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేశారు. 1895లో కోల్‌కతాలో సీఐఐ ఏర్పాటైందని, 1996 ప్రాంతంలో తాను దాన్ని ప్రమోట్‌ చేశానని చెప్పారు. 1990ల ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని హైదరాబాద్‌ను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేశానని, ఆ చర్యల వల్ల ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్‌ వన్‌గా ఉందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మారామని, పెట్టుబడిదారులు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అంతా ఆన్‌లైన్‌లో రియల్‌ టైమ్‌లో పరిష్కరిస్తున్నామని వివరించారు.

ఏపీలో డిజిటల్‌ హబ్‌లు, డేటా సెంటర్లు వస్తున్నాయని, రాయలసీమలో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. సముద్ర తీరాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేలా ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామని, పోర్టుల అనుసంధానం, కారిడార్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ, పుట్టపర్తిలో డిఫెన్స్‌-ఏరోస్పేస్‌ ప్రాజెక్టు శంకుస్థాపన చేశామని, అతిపెద్ద రక్షణ తయారీ కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడ్డాయని చెప్పారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా రంగాల్లో ఎగుమతులకు చర్యలు చేపట్టామని తెలిపారు.

బిల్డ్‌ ఏపీ నినాదంతో పని చేస్తున్నామని సీఎం ప్రకటించారు. గతేడాది భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని, గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని అన్నారు. ఎంఓయూలను కేవలం ఒప్పందాలుగా ఉంచకుండా వాస్తవ పెట్టుబడులుగా మలిచేలా కృషి చేస్తున్నామని, పారిశ్రామిక ప్రోత్సాహకాలను నవంబర్‌ 12, 13 తేదీల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నాలా యాక్టును రద్దు చేశామని, గూగుల్‌ 1 గిగావాట్‌ డేటా సెంటర్‌, ఆర్సెలార్‌ మిత్తల్‌ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.

గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, కావేరి నదుల అనుసంధానం జరిగితే ఏపీ, కర్ణాటక, తమిళనాడులకు నీటి కొరత ఉండదని అన్నారు. రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని, దక్షిణాసియాకు గేట్‌వేగా ఏపీని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దుగ్గరాజపట్నంలో మజగావ్‌ డాక్‌యార్డ్‌ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌, మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్‌ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం లభించిందని, తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో డ్రోన్‌, ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 5వ తరం ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టు రాయలసీమలో ప్రారంభమైందని, 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్లకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.

పరిపాలనలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు జోడించి సేవలు వేగవంతం చేశామని, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ ద్వారా చర్యలు చేపట్టామని అన్నారు. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్‌ ప్రారంభానికి చర్యలు మొదలుపెట్టామని, అమరావతిని గ్లోబల్‌ టెక్‌ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ మొదలవుతాయని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో తయారు చేసేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నామని, డ్వాక్రా ఉత్పత్తులను స్వయం బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్లకు ప్రమోట్‌ చేస్తామని తెలిపారు. బ్లూ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని అన్నారు.

రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణం అమలు చేయడానికి ఏపీ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Next Story