Union Aviation Minister Ram Mohan Naidu: గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ హబ్‌లకు తోడ్పడేందుకు భారత్ సిద్ధం: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు

Union Aviation Minister Ram Mohan Naidu: గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ హబ్‌లతో పోటీ పడకుండా వాటికి తోడ్పాటు అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్ నాయుడు ప్రకటించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గిఫ్ట్ సిటీలో శుక్రవారం జరిగిన ‘ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమిట్ 2.0’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
దేశ విమానయాన రంగం అత్యంత వేగంగా రూపాంతరం చెందుతోందని, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. భారత్ సృష్టించే పర్యావరణ వ్యవస్థ దేశానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
‘ప్రపంచస్థాయి కీలక శక్తి’
“మేము ప్రపంచస్థాయిలో కీలక శక్తిగా ఎదగాలని భావిస్తున్నాం. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌కు తోడ్పాటు అందించాలనుకుంటున్నాం. భారత్‌కు భారీ మార్కెట్ ఉంది. భవిష్యత్తులో విమానయాన రంగంలో అగ్రగామిగా ప్రపంచం భారత్‌ను చూస్తుంది. సరైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం కీలకం” అని రామ్‌మోహన్ నాయుడు అన్నారు.
గిఫ్ట్ సిటీలోని ఐఎఫ్‌ఎస్‌సీని కేవలం రిజిస్ట్రేషన్ కేంద్రంగా కాకుండా పూర్తి సేవా కేంద్రంగా, గ్లోబల్ లీజింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇప్పటికే అక్కడ పలు విమాన లీజింగ్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు.
2032 నాటికి భారీ వృద్ధి
2032 నాటికి దేశంలో విమానాల సంఖ్య భారీగా పెరుగుతుందని, త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని మంత్రి వెల్లడించారు. దేశీయ ఆర్థిక సంస్థలు కూడా ఈ రంగంలో భాగస్వామ్యం వహించాలని పిలుపునిచ్చారు. విమానయాన రంగానికి అవసరమైన చట్టపరమైన, ఆర్థిక సంస్కరణలను కేంద్రం కొనసాగిస్తుందన్నారు.
అహ్మదాబాద్‌లో గత ఏడాది జరిగిన ఎయిర్‌ఇండియా విమాన ప్రమాదం ఘటనపై దర్యాప్తు చివరి దశలో ఉందని, మరో నెలలో తుది నివేదిక విడుదలయ్యే అవకాశముందని రామ్‌మోహన్ నాయుడు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా విచారణ జరుపుతున్నామన్నారు.

