సమాధానాలు మాత్రం చిన్నవే!

Inquiry Against PV. Sunil Kumar: వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప స్పీకర్ కె. రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో జరిగిన చిత్రహింసల కేసులో ప్రధాన నిందితుడు, మాజీ సీఐడీ అధిపతి, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను సోమవారం దర్యాప్తు అధికారి ప్రశ్నించారు. విజయనగరం ఎస్పీ దామోదర్‌ నేతృత్వంలో గుంటూరు సీసీఎస్‌ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణ సుమారు 5 గంటల పాటు సాగింది.

ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి దశ విచారణ జరిగింది. భోజన విరామం అనంతరం మళ్లీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఇద్దరు వీఆర్‌ఓల సమక్షంలో పూర్తి విచారణను వీడియో రికార్డింగ్ చేశారు.

ప్రశ్నల వర్షం... ముక్తసరి సమాధానాలు!

దర్యాప్తు అధికారి దామోదర్‌ సునీల్‌కుమార్‌పై అనేక కీలక ప్రశ్నలు సంధించారు. "రఘురామకృష్ణరాజును కస్టడీలో ఎందుకు కొట్టారు? కొట్టమని ఎవరు ఆదేశించారు? ముసుగు ధరించి వచ్చి హింసించిన వ్యక్తులెవరు? వారిని పంపించిందెవరు? గుండెపై కూర్చొని ఊపిరి ఆడకుండా చేయమని ఆదేశాలిచ్చారా? ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటి? వ్యక్తిగతంగా రఘురామపై దాడి చేయాల్సిన అవసరమేమిటి? హింసల తరవాత మీరు ఏం చేశారు? కింది అధికారులు మీకు తెలియకుండా చేసి ఉంటే వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? ప్రాథమిక విచారణ చేసిన సునీల్‌నాయక్‌ను గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎందుకు పంపారు? అంతర్గత విచారణలు ఏమైనా నిర్వహించారా? ఈ ఘటనపై ఏ నివేదిక ఇచ్చారు?" అంటూ ప్రశ్నల జడి కురిపించారు.

అయితే సునీల్‌కుమార్‌ ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇవ్వలేదు. కొన్నింటికి "తెలియదు" అన్నారు. మరికొన్నింటికి మౌనంగా ఉన్నారు. కొన్నింటికి "రికార్డుల్లో సమాధానాలు ఉంటాయి" అంటూ సరిపెట్టారు. మొత్తంగా విచారణకు పూర్తిగా సహకరించలేదని తెలుస్తోంది. దీంతో మళ్లీ విచారణకు పిలిచేందుకు నోటీసులు జారీ చేయనున్నారు.

విచారణ సందర్భంగా పశ్చిమ డీఎస్పీ అరవింద్, ఏఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story