Minister Anagani: బొప్పరాజు పొలిటికల్ అజెండాతో పనిచేస్తున్నారా?: మంత్రి అనగాని ఆగ్రహం
మంత్రి అనగాని ఆగ్రహం

Minister Anagani: ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వైఖరిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
వెలగపూడి సచివాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి, “ఉద్యోగుల సమస్యలే అజెండాగా బొప్పరాజు పనిచేస్తున్నారా? లేక పొలిటికల్ అజెండాతో పని చేస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఉద్యోగులు-ప్రభుత్వం మధ్య సఖ్యతను చెడగొట్టేలా ఆయన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ హయాంలో పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం పెట్టిందనే రీతిలో బొప్పరాజు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి కనీసం ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఆయన ధోరణి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఆర్థిక కష్టాలు ఉన్నా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు చాలా వరకు చెల్లించామని, 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపజేశామని తెలిపారు. ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్మును గత ప్రభుత్వం వాడుకుంటే తిరిగి జమ చేశామని చెప్పారు.
సీఎం చంద్రబాబును అవమానించేలా సభలు నిర్వహిస్తే సహించబోమని హెచ్చరించారు. ఉద్యోగులు బొప్పరాజు వ్యవహార శైలిని గమనించాలని కోరారు.

