Nellore MLA Kotamreddy Sridhar Reddy: విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టింది నిజమే.. 72 అవమానాలు జరిగాయి: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

Nellore MLA Kotamreddy Sridhar Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేసిన విషయం నిజమేనని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరులో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో ప్లీనరీ జరిగినప్పుడు రెస్ట్ రూమ్‌లో వేదికపై ఎవరితో మాట్లాడించాలనే అంశంపై విజయసాయి రెడ్డి, సజ్జల మధ్య వివాదం తలెత్తిందని, మాటామాటా పెరిగి సజ్జల కొట్టిన విషయం వాస్తవమేనని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయం చాలా మంది నేతలకు తెలుసునని పేర్కొన్నారు. విజయసాయికి వైసీపీలో 72 అవమానాలు జరిగాయని చెప్పారు. నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేసినప్పుడు ఆయనపై ఎంత నీచంగా, ఘోరంగా మాట్లాడారో అందరికీ తెలుసునని అన్నారు.
తనకు ఒక్కడికే తెలిసిన మరో ఘోర అవమానం గురించి కూడా వెల్లడించారు. విజయసాయి తన సొంతూరైన తాళ్లపూడికి వచ్చినప్పుడు కాకుపల్లి సెంటర్‌లో వంద వాహనాలతో ఘనంగా స్వాగతం పలికారని, దానిపై సజ్జల ఆయన్ను దారుణంగా, నీచాతినీచంగా దూషించారని చెప్పారు. ఆ మాటలు చెప్పలేనంత ఘోరంగా ఉన్నాయని అన్నారు.
‘‘నేను చాలా పెద్ద తప్పు చేశానని సజ్జల అన్నారు. అమరావతి రైతులు వరదలు, భారీ వర్షాల్లో ఇబ్బందులు పడుతుంటే నేను మాట్లాడాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దాటేంత వరకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పా. అప్పుడూ సజ్జల నన్ను చాలా పెద్ద తప్పు చేశావన్నారు. ఇలాంటి మాటలు నాతో మాట్లాడొద్దని, ఆ తప్పు చేసింది నువ్వా నేనా అని సజ్జలను ఎదిరించి మాట్లాడాను. మా ఊరిలో విజయసాయి మీటింగ్ పెట్టి నన్ను ఎలా పడితే అలా తిట్టాడు. ఆయనంటే నాకు మంచి అభిప్రాయం లేదు’’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లు ప్రజావ్యతిరేక పాలన కొనసాగిందని, దేశవిదేశాల నుంచి ఆంధ్రులు వచ్చి ఓట్లు వేసి కూటమిని గెలిపించారని అన్నారు. కూటమి ప్రభుత్వ ఘనవిజయం ఒక చరిత్ర అయితే వైసీపీ ఘోర పరాజయం కూడా చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఎందుకు ఓడిపోయామనే ఆలోచన లేకుండా వైసీపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ వికృత రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
హిందూ మతానికి ఘోర అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఆలయాల్లో రథాలు తగులబడినప్పుడు, విగ్రహాల తలలు తెగ్గొట్టినప్పుడు, సింహాల విగ్రహాలు చోరీకి గురైనప్పుడు వారి నోళ్లు ఏమయ్యాయని అడిగారు. తిరుపతి వేంకటేశ్వర ఛానెల్‌ను కూడా రాజకీయాలకు వాడుకున్నారని తెలిపారు. వైసీపీ మాజీ మంత్రిపై ఆయన కోడలు సంచలన ఆరోపణలు చేశారని, జగన్, వైసీపీ నేతలు, సాక్షి మీడియా ఎందుకు ఈ విషయంపై స్పందించట్లేదని ప్రశ్నించారు.
ఏపీని అస్థిరపరచాలని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని ఫేక్ వీడియోలతో ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ క్రెడిట్ చోరీ చేస్తూ నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టింది జగనే అని చెప్పేటట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

