అమరావతిపై అక్కసెందుకు అని వైకాపాపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం

  • వరదలతో మునిగేది అమరావతి కాదు ప్రజా వ్యతిరేకతతో వైకాపా పార్టీ మునిగిందన్న మంత్రి దుర్గేష్
  • అమరావతి ప్రతిష్టతో ఆడుకుంటే మీకు భవిష్యత్ లో 11 సీట్లు కూడా రావని హెచ్చరిక
  • దమ్ముంటే రాజధానిలో పర్యటించి అమరావతి మునిగిపోయిందని నిరూపించాలని సవాల్

అమరావతి రాజధాని వరదల తాకిడికి మునిగిపోయిందని గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. వరదలతో మునిగేది అమరావతి కాదు సార్వత్రిక ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతో వైకాపా పార్టీ మునిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆది నుండి అమరావతి రాజధానిపై అక్కసుతో ఉన్న వైకాపా నేతలు గతేడాది బుడమేరు వరదల ఫోటోలను, వీడియోలను చూపించి అమరావతి మునిగిందని ప్రజల్లో అపోహలు సృష్టించారు.గడిచిన ఐదేళ్లలో అమరావతిని ముంచేందుకు కుట్ర చేశారని గుర్తుచేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతిని నామరూపాల్లేకుండా చేయాలని ప్రయత్నించారు. అమరావతిని స్మశానంతో, ఎడారితో పోల్చి చెప్పారు. ఇవేవీ వర్కవుట్ కాకపోవడంతో తాజాగా కురుస్తున్న వర్షాలతో అమరావతి మునిగిపోయిందని పదే పదే విషం చిమ్ముతూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులను చేసేలా కొండవీటి వాగు, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని, పొన్నూరు, విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తనుందని తప్పుడు ప్రచారానికి తెరదీశారని విమర్శించారు. ఇది ఎంత వరకు సమంజమని మంత్రి దుర్గేష్ వైసీపీని ప్రశ్నించారు. అమరావతి రాజధాని పరిధిలోని ప్రజల బాగోగులు వైకాపాకు పట్టవా అని నిలదీశారు. దమ్ముంటే రాజధానిలో స్వయంగా పర్యటించి ఎక్కడ అమరావతి మునిగిపోయిందో చూపించాలని సవాల్ విసిరారు.

భవిష్యత్ లో కూడా వరదలు వస్తే రాజధాని ప్రాంతంపై ప్రభావం పడకుండా కొండవీడు ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు నిర్మించిన విషయం వైకాపా మర్చిపోయిందా అని మంత్రి దుర్గేష్ నిలదీశారు. అమరావతి అత్యంత అనువైన ప్రాంతమని, సురక్షితమైన ప్రాంతమని, ఎంత భారీ వర్షాలకు, వరదలకు కూడా మునగదు అని తెలిసి కూడా రాజకీయ స్వార్థంతో పొలాల్లో ఉన్న వర్షపు నీటిని జూమ్ చేసి రాజధాని మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని భ్రమ పడుతున్నారా అని ప్రశ్నించారు. నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే 11కే పరిమితం అయ్యారనే విషయం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. అమరావతి మునిగిపోయిందన్న మీ కల కల్లలుగానే మిగిలిపోతుందన్నారు. మీరెలాగూ ప్రజల్లోకి రారు, కనీసం మీ నేతలనైనా పంపించి హైకోర్టు, శాసనసభ్యులు, మండలి సభ్యుల భవనాలకు వెళ్లే దారులు, సీడ్ యాక్సెస్ రోడ్డు,ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల భవన సముదాయాలు, గ్రూప్ డీ ఉద్యోగుల భవనాల పరిసరాల్లో పర్యటించి వాస్తవం తెలుసుకోవాలని సూచించారు. అమరావతి ప్రతిష్టతో ఆడుకుంటే మీకు భవిష్యత్ లో 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. వైసీపీ హయాంలో రోడ్లు నరకానికి రహదారాలుగా మారాయని, అడుగడుగున గుంతలతో ప్రయాణీకులు రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి ఉండేదని, కనీసం తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను నాగరికతను చిహ్నంగా భావించి తాత్కాలికంగా గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కు బాటలు వేసిందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 40 శాతం ఓటు షేర్ వచ్చిందని చెప్పుకునే వైసీపీకి ప్రజల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేని వైసీపీ సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారం చేస్తుందన్నారు.రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కూటమి కార్యకర్తలు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ చోద్యం చూస్తోందని, ఏసీల క్రింద కూర్చొని ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్తుంటే కాపాడుకోలేని వైకాపా మునిగిపోయే నావ అని మంత్రి దుర్గేష్ ఘాటుగా విమర్శించారు. వరదల విషయంలో తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story