జగన్ రాజధానిపై తన స్టాండ్ మార్చుకున్నారు : మంత్రి నారాయణ

Minister Narayana: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాజధాని విషయంలో స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. "జగన్ స్వయంగా అసెంబ్లీలో రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పారు. కానీ, తర్వాత రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదనతో గందరగోళం సృష్టించారు. ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. అమరావతి అనంతపురం, శ్రీకాకుళం మధ్య సమన్వయ కేంద్రంగా ఉంది. రైల్వే, పోర్టు, విమానాశ్రయం వంటి అనుసంధాన సౌకర్యాలు అమరావతి సమీపంలో ఉన్నాయి. జగన్ కూడా గతంలో అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా అంగీకరించారు. కానీ, అధికారంలోకి రాగానే మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని, మళ్లీ అధికారం కోసం అమరావతి అని మాట మార్చడం సరికాదు" అని నారాయణ విమర్శించారు.

"ఇలాంటి వైఖరి కొనసాగితే, భవిష్యత్తులో ప్రజలు వైకాపాకు గత ఎన్నికల్లో ఇచ్చిన 11 సీట్లు కూడా ఇవ్వరు. కొద్దిమంది సలహాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. సజ్జల సీనియర్ నేతగా చెప్పినది వైకాపా అభిప్రాయంగానే భావించాలి. అలాగే, నేను మంత్రిగా మాట్లాడితే అది సీఎం చంద్రబాబు అభిప్రాయంగా భావిస్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరును కలిపి భవిష్యత్తులో మహా నగరంగా తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన" అని మంత్రి నారాయణ వివరించారు.

విజయవాడలో డయేరియా సమస్యపై చర్యలు

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసుల మూల కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. శనివారం ఆయన ఆర్‌ఆర్‌పేటలో పర్యటించి, స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా వైద్య శిబిరాన్ని పరిశీలించారు. నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

"ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల నివేదికలు అందుతాయి. రిపోర్టుల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటాం. డయేరియాకు కారణం తాగునీరా లేదా ఆహార విషబాధా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం 15 వేల వాటర్ క్యాన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నాం. ఇప్పటివరకు 150 మంది చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలూ సంభవించలేదు. ప్రజలు వదంతులను నమ్మవద్దు" అని మంత్రి నారాయణ సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story