CM Chandrababu: అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడే జగన్‌కు విలువ లేదు.. గ్రూప్-1 అతిపెద్ద కుంభకోణం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా బయట చెప్పే మాటలకు విశ్వసనీయత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని, వాటిని అసెంబ్లీకి వచ్చి చెప్పే ధైర్యం లేదు కాబట్టే బయట నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
బుధవారం శాసనసభలోని తన కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ‘‘ప్రజా సమస్యలపై శాసనసభలో మాట్లాడితే వాటికి ఒక విలువ, గుర్తింపు ఉంటాయి. వైకాపా సభ్యులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తితే వాటిపై చర్చిస్తాం. పాలకపక్షం తప్పులు చేస్తుంటే చట్టసభల్లో నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత. వైకాపా ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. దేవాలయం వంటి అసెంబ్లీని ఒక పార్టీ పూర్తిగా బహిష్కరించడం చరిత్రలో లేదు. అసలు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొనని పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లేయాలి?’’ అని నిలదీశారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 సర్వీస్ నియామకాలు అతిపెద్ద కుంభకోణమని సీఎం ఎండగట్టారు. అప్పటి పాలకులు ఊహకు అందని అక్రమాలకు పాల్పడ్డారని, హైకోర్టు నిశిత పర్యవేక్షణ కొనసాగుతున్నా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. యువత జీవితాలతో బంతాట ఆడుకున్నారని మండిపడ్డారు.
గ్రూప్-1 పరీక్షల్లో డిజిటల్ మూల్యాంకనం రద్దు చేసి మాన్యువల్‌గా చేపట్టాలని కోర్టు ఆదేశించినా, ఇంటెలిజెన్స్ ఐజీ పీఎస్‌ఆర్ అంజనేయులుకే ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించి ఛైర్మన్‌ను కట్టడి చేశారని చెప్పారు. టెండర్లు లేకుండానే ప్రైవేట్ ఏజెన్సీకి మూల్యాంకన బాధ్యతలు అప్పగించి, ప్రైవేట్ ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా ప్రక్రియ నిర్వహించారని వివరించారు.
తప్పు చేసినవారిని మామూలుగా అరెస్ట్ చేస్తే సరిపోదని, సమాజం గుర్తుంచుకునేలా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీని సమూల ప్రక్షాళన చేసి విశ్వసనీయత పెంచుతామని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పటిష్ట వ్యవస్థలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

