Srinivasananda Saraswati: హైకోర్టు హెచ్చరికలు చేసిన జగన్‌కు జ్ఞానం రాలేదు: శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం
జగన్‌కు జ్ఞానం రాలేదు: శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

Srinivasananda Saraswati: తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయ పరకామణి చోరీ కేసును చిన్న విషయంగా అభివర్ణించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ భక్తుల భావాలను గౌరవించకుండా మాట్లాడటం దురదృష్టకరమని, వైఎస్ఆర్‌సీపీ నేతలకు హిందువులు అంత తక్కువగా కనిపిస్తున్నారా? అని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి మండిపడ్డారు.
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘శ్రీ వేంకటేశ్వరస్వామి వారి గురించి మాట్లాడేటప్పుడు అపార భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఆ మహానుభావుడిని కించపరిచేలా జగన్ మాట్లాడటం వింటే హృదయం బద్దలవుతుంది. హైకోర్టు మొట్టికాయలు వేసి హెచ్చరించినా కూడా ఆయనకు బుద్ధి రాలేదు. హిందూ ధర్మం, దేవాలయాలపై దాడులు చేయడమే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు ఎప్పుడైనా హిందువుల పక్షాన నిలబడ్డారా? చెప్పగలరా?’’ అని శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రశ్నించారు.
తిరుమల దేవాలయంలో జరిగిన పరకామణి చోరీ ఘటనపై జగన్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర వేదన కలిగించాయని, ఇలాంటి మాటలు భక్తుల భావాలను దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధు పరిషత్ తరపున ఈ విషయంపై తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

