Jagan Tour: ఇబ్రహీంపట్నం పర్యటనలో వైకాపా కార్యకర్తల బరితెగింపు: పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రహదారి అడ్డుకట్ట
పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రహదారి అడ్డుకట్ట

Jagan Tour: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పరామర్శించేందుకు చేపట్టిన యాత్ర నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శుక్రవారం ఉదయం నుంచే రెచ్చిపోయారు. పోలీసులను బెదిరిస్తూ, కవ్విస్తూ, రెచ్చగొట్టేలా తిడుతూ అల్లర్లు సృష్టించారు.
‘మమ్మల్నే అడ్డుకుంటారా.. మేం అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు’ అంటూ పోలీసులను బెదిరించారు. ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై వాహనాలను అడ్డంగా పార్క్ చేసి రాకపోకలను స్తంభింపజేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు వాహనాలు కిలోమీటర్ల తరబడి నిలిచిపోయాయి. సాధారణ ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు.
తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి బయలుదేరకముందే విజయవాడ, మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది కార్యకర్తలను వాహనాల్లో తరలించారు. ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బైక్‌లతో స్టంట్లు చేస్తూ, సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దాలతో హల్‌చల్ సృష్టించారు. కొందరు మద్యం సేవించి రహదారిపై ఊగిసలాడారు.
జగన్ ఫ్లెక్సీలను చూపుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లపై దుర్భాషలాడుతూ సవాళ్లు విసిరారు. ఒక వైకాపా కార్యకర్త చేతికి గాటు పెట్టుకుని రక్తంతో జగన్ చిత్రపటానికి తిలకం పెట్టాడు. చుట్టూ ఉన్నవారు నినాదాలు చేస్తూ ఉత్సాహం చూపారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో అతని చేతికి కట్టుకట్టారు.
జగన్ ర్యాలీ ఉదయం 11.06 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మంగళగిరి, కాజా మీదుగా విజయవాడ బైపాస్ రోడ్డు, గొల్లపూడి అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపైకి చేరుకుంది. సాయంత్రం 5.05 గంటలకు జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఆరు గంటలకుపైగా ఈ పరామర్శ యాత్ర కొనసాగింది.
ఈ ఘటనలతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రహదారి రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు కానీ, వైకాపా కార్యకర్తల ఆగ్రహావేశాలు ఆపలేకపోయారు.

