Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన తన భర్త జోగి రాజీవ్, అత్తమామలు, బంధువులపై దేశీయ హింస కేసు నమోదు చేశారు. ‘నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు’ అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిర్ఘాంతపోయే వివరాలు వెల్లడించారు.

2025 మే 28న సూర్యాపేటలో జరిగిన వివాహం తర్వాత భర్త రాజీవ్ ఏనాడూ సరిగ్గా చూసుకోలేదని, శారీరకంగా, మానసికంగా వేధించాడని మేఘన ఆరోపించారు. అత్తమామలు అతనికి వత్తాసు పలికారని తెలిపారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు చాలవని మరో రూ.5 కోట్లు, ఫార్చ్యూనర్ కారు, అత్త, ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఫిర్యాదు చేశారు. తన ఆస్తులను భర్త పేరిట బదిలీ చేయాలని కూడా డిమాండ్ చేశారని పేర్కొన్నారు.

ఒకసారి ఇంటి టెర్రెస్‌పై నుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి తనను తోసేయాలని ప్రయత్నించారని, మరోసారి మెడకు చున్నీ బిగించి, ముఖంపై దిండు పెట్టి చంపాలని చూశారని ఆరోపించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే ‘మీకు శవమే కనిపిస్తుంది’ అని బెదిరించారని తెలిపారు.

పెళ్లికి రూ.5 కోట్లు, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచుకు రూ.9 లక్షల కట్నంతో పాటు అనేక కానుకలు ఇచ్చినా వేధింపులు ఆగలేదని మేఘన వివరించారు. భర్తకు శారీరక సమస్య ఉందని దాచిపెట్టి మోసం చేశారని, తనను రోజుల తరబడి బంధించి భోజనం కూడా పెట్టలేదని ఆరోపించారు. అగర్‌బత్తీ వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తోందని అవమానించేవారని, తర్వాత వారు క్రైస్తవంలోకి మారిన విషయం తెలిసిందని పేర్కొన్నారు.

గోవాకు తీసుకెళ్లి బోటులో నుంచి తోసేయాలని ప్రయత్నించారని, మరోసారి ఎవరూ లేని చోట వదిలేసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని నార్సింగి విల్లాకు తీసుకెళ్లి భర్త, మామ, బంధువులు కొట్టి, తన్ని, దిండుతో ముఖం మూసి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. 2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి అందరూ కలిసి దాడి చేశారని, మామ దిండు నొక్కి, భర్త మెడకు చున్నీ బిగించి చంపాలని చూశారని వివరించారు. భయంతో ప్రాధేయపడిన తర్వాతే విడిచిపెట్టారని మేఘన తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story