ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో నలుగురు అదనపు న్యాయమూర్తులు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.రాష్ట్ర హైకోర్టులో ఇప్పటి వరకూ అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న జస్టిస్ హరినాధ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ (కిరణ్మయి కనపర్తి), జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ లను న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆనలుగురు అదనపు న్యాయమూర్తులచే న్యాయమూర్తులుగా ప్రమాణం స్వీకారం చేయించారు.

హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీ నారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు ప్రభ్రుతులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story