CM Chandrababu: 4 జూన్ 2024ను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రాత్మక రోజుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన ఆ రోజుకు నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో సీఎం ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.

“ఆ విజయం మాకు కేవలం అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం” అని చంద్రబాబు తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం:

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం వివరించారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

“ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతం (హెల్తీ), సంపన్నం (వెల్తీ), సంతోషవంతం (హ్యాపీ)గా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తున్నాం” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం, ‘జై ఆంధ్రప్రదేశ్’ అని ముగించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story