Kanipakam Varasiddhi Vinayaka Swamy Festivities: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు: ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి ఇస్తున్నాం – మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Kanipakam Varasiddhi Vinayaka Swamy Festivities: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూనే ఆధ్యాత్మికంగా కూడా మరింత ముందుకు సాగుతోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి ఆనం స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల సంఖ్య గతం కంటే 35 నుంచి 40 శాతం పెరిగిందని వెల్లడించారు.
భక్తులకు మెరుగైన వసతులు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు కల్పించడమే ఆలయాల్లో భక్తుల పెరుగుదలకు ప్రధాన కారణమని మంత్రి తెలిపారు. ఏపీలో పలు ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీగా నిధులు కేటాయిస్తున్నామని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కొత్త ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. నిత్య నైవేద్యాలు, అన్నదాన కార్యక్రమాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. తిరుమలతో పాటు కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.
రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలకు కూడా ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఆనం వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడోసారి ముఖ్యమంత్రిగా గోదావరి పుష్కరాలు జరగడం ఆయన చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుని కోరుకున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

