సుప్రీం నిరాకరణ తర్వాత శ్రీలంక మీదుగా వస్తుండగా శంషాబాద్‌లో సిట్‌ అదుపు

Liquor Scam: వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి (ఏ9)ని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌) అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. మద్యం లంచాల సొమ్మును దారి మళ్లించేందుకు డొల్ల కంపెనీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయనను శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకుని సిట్‌కు అప్పగించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 నవంబరులో దుబాయ్‌కి పారిపోయిన కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పటి నుంచి విదేశాల్లోనే ఉన్నారు. ఆయనపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ అయింది. ఇప్పటికే పలువురు నిందితులు అరెస్ట్‌ కావడంతో ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం బెయిల్‌ నిరాకరించి వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేక శ్రీలంకలోని కొలంబో నుంచి విమానంలో హైదరాబాద్‌కు వస్తుండగా అరెస్ట్‌ అయ్యారు.

సిట్‌ బృందం ఆయనను విజయవాడకు తీసుకువచ్చింది. మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. రాజ్‌ కెసిరెడ్డి (కసిరెడ్డి) తరఫున వ్యవహారాలు నడిపిన కిరణ్‌కుమార్‌రెడ్డి ‘టెక్కర్‌’ వంటి డొల్ల కంపెనీల ద్వారా ముడుపుల సొమ్మును దారి మళ్లించినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాలు వసూలు చేసే నెట్‌వర్క్‌ను ఆయన నడిపించినట్లు అధికారులు తేల్చారు. మద్యం రవాణా దోపిడీ, ఈడీ కేసుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

తిరుపతికి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి కానిస్టేబుల్‌ కుమారుడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదివారు. రాజ్‌ కెసిరెడ్డి ద్వారా కుంభకోణంలోకి చేరి మరికొందరు ఐఐటీ విద్యార్థులను కూడా భాగస్వాములను చేశారు. ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు, అంతిమ లబ్ధిదారుల వాటా బయటపడే అవకాశం ఉందని సిట్‌ అధికారులు భావిస్తున్నారు.

ఇదే కేసులో మరో నిందితుడు సైఫ్‌ అహ్మద్‌ (ఏ10) కూడా భారత్‌కు వస్తున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగుబాటు పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనపైనా ఎల్‌ఓసీ ఉండడంతో విమానాశ్రయంలోనే సిట్‌ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

మద్యం రవాణా టెండర్ల అక్రమాల కేసులో బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ల రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story