YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం.. ఇక రోజువారీ విచారణ
రోజువారీ విచారణ

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లో కూడా ఇకపై రోజువారీ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.
ఇప్పటి వరకు సీబీఐ కోర్టు సీబీఐ కేసుల్లోనే రోజువారీ విచారణ చేపడుతోంది. ఈడీ కేసుల విచారణ సీబీఐ కేసులు పూర్తయిన తర్వాతే ప్రారంభమవుతుందని భావించి ఈడీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేసింది. తాము నమోదు చేసిన 9 కేసుల్లో కదలిక లేదని అందులో పేర్కొంది. దీంతో సీబీఐ కోర్టు ఈడీ కేసుల్లోనూ రోజువారీ విచారణకు అంగీకరించింది. ఒక రోజు సీబీఐ కేసు, మరో రోజు ఈడీ కేసు విధంగా కోర్టు సమయాన్ని బట్టి రెండు కేసుల్లోనూ విచారణ సాగే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఈడీ కేసులను కూడా కోర్టు జాబితాలో ఉంచుతోంది.
హెటిరో, అరబిందో వ్యవహారంపై విచారణ
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హెటిరో, అరబిందో సంస్థలకు జడ్చర్లలో 75 ఎకరాల భూమి కేటాయించినందుకు ప్రతిఫలంగా అరబిందో, ట్రైడెంట్ రూ.10 కోట్లు, హెటిరో రూ.19.50 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాయని ఈడీ కేసు నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్పై బుధవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావు విచారణ చేపట్టారు. జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్రెడ్డి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు వర్తించదని, క్రిమినల్ కేసు తేలకుండా ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని, ఆరోపణలకు ఆధారాలు లేవని వాదించారు.
అక్రమాలకు సంబంధించిన వివరాలు
జగన్ అక్రమాస్తులకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ 2011లో జగన్, విజయసాయి రెడ్డితో పాటు 73 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి నుంచి లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా లబ్ధిదారులు జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వంటి కంపెనీల్లో షేర్ వాస్తవ ధర కంటే అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారని ఆరోపణ. ఇందులో రాంకీ ఫార్మా, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, వాన్పిక్ ప్రాజెక్ట్, పెన్నా గ్రూపు, ఇందూ గ్రూపు వంటి సంస్థలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అభియోగపత్రాలు దాఖలు చేసింది.
మొత్తం 20 కేసులు (సీబీఐ 11, ఈడీ 9) విచారణలో ఉన్నాయి. ప్రధాన నిందితులు జగన్, విజయసాయి రెడ్డితో పాటు 134 డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై వాదనలు పూర్తయి తీర్పు దశలో 2024లో సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. సీబీఐ 5 కేసుల్లో వాదనలు ముగిశాయి. మిగిలినవాటిలో విచారణ కొనసాగుతోంది.

