Korea–Andhra Pradesh: దక్షిణ కొరియాతో ఆంధ్రప్రదేశ్ బంధాలను మరింత దృఢపరచే దిశగా ఏపీ ఎకానమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ)లో కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్‌లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీలో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. దీని భాగంగా గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, పుంగనూరులో ఈవీ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శ్రీసిటీ-చిత్తూరు-తిరుపతి కారిడార్ వెంబడి ప్రత్యేక కొరియన్ ఆటో కాంపోనెంట్స్ పార్కులు ఏర్పాటు చేస్తామని, ఉమ్మడి టూలింగ్, టెస్టింగ్ సౌకర్యాలు, పూర్తి స్థాయి సదుపాయాల కోసం కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

వివిధ సంస్థలతో చర్చలు:

మంత్రి లోకేశ్ కొరియా సంస్థలతో జరిపిన భేటీల్లో అనేక ప్రతిపాదనలు చేశారు. శ్రీసిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కుకూ ఎలక్ట్రానిక్స్‌ను కోరారు. ఈవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ కోసం మోటివ్ లింక్ సంస్థను ఆహ్వానించారు. సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్‌ను కోరారు. బెస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు డెల్టా ఎక్స్ సంస్థతో చర్చించారు. అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక కోట్రా కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

నాయుడుపేటలో అతిపెద్ద ప్లాంట్:

షిన్‌హ్యూప్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ టే హూ కిమ్‌తో జరిపిన సమావేశంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ)ల క్లస్టర్ నిర్మాణం కోసం సహకరించాలని కోరారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈవీ, ఆటో, హెల్త్‌కేర్, స్మార్ట్ మీటరింగ్ రంగాలకు అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది.

శాంసంగ్ సిటీ ప్రతిపాదన:

ఏపీలో శాంసంగ్ సిటీ నిర్మాణం చేపట్టాలని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అధికారులను లోకేశ్ కోరారు. ఆర్‌&డి విభాగాన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీలోకి తీసుకురావాలని, రాజధాని నగరం అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ చర్చలు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొరియా సంస్థలు సానుకూలంగా స్పందించాయని మంత్రి లోకేశ్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story