Minister Atchannaidu: శాంతిభద్రతలే రాష్ట్ర అభివృద్ధికి పునాది: మంత్రి అచ్చెన్నాయుడు
మంత్రి అచ్చెన్నాయుడు

Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటాయని, అందువల్లనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రగతికి పునాది అని ఆయన అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు (మంగళవారం) జరిగిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. 10 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసిన 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి, పోలీసు సేవల్లోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం కాదని, సమాజ సేవలో గొప్ప బాధ్యత అని ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
గత 8 నెలల్లో దాదాపు 5,800 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 1,156 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పోలీసు నియామకాలు చేపడతామని కూడా స్పష్టం చేశారు.

