CM Chandrababu: పెట్టుబడుల రక్షణకు చట్టం: ప్రభుత్వం మారినా ఇబ్బంది లేదు - సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రభుత్వం మారితే పెట్టుబడుల పరిస్థితి ఏమవుతుంది, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉంటాయేమో అనే సందేహాలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయని, వారికి భరోసా ఇచ్చేలా పెట్టుబడుల రక్షణ చట్టాలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో బిల్లు ఆమోదించాక కేంద్రానికి పంపుతామన్నారు. జాతీయ స్థాయిలోనూ అలాంటి చట్టం చేస్తే పెట్టుబడిదారులు భారత్‌కు తరలి వస్తారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించారు.
విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ రెండున్నరేళ్ల కూటమి పాలనలో అమలు చేసిన పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, సాధించిన పురోగతిని వివరించారు. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించామని, ఆటోమేటిక్ డీమ్డ్ అప్రూవల్, థర్డ్ పార్టీ ఎంప్యానెల్మెంట్ విధానాలకు ఇటీవలే అనుమతి ఇచ్చామని తెలిపారు.
మీరు ఏ వ్యాపారం చేయాలనుకున్నా, ఏ పెట్టుబడి పెట్టాలనుకున్నా సహకరించేందుకు, సేవ చేసేందుకు మా ప్రభుత్వం ఉందని, మీ పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తామని, తగిన ప్రతిఫలం లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పెట్టుబడులకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేసేందుకు ఎస్క్రో ఖాతా ఏర్పాటు చేసి చూపించామని చెప్పారు.
రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2024 జూన్‌లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, ఈ సదస్సులో చేసుకోబోయే రూ.9.89 లక్షల కోట్ల ఒప్పందాలతో కలిపి రూ.32.49 లక్షల కోట్లకు చేరుకుంటున్నామని ప్రకటించారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో 160 గిగావాట్లు ఏపీలోనే ఉత్పత్తి చేయబోతున్నామని, ఆరు నెలల్లో దీన్ని దాటేస్తామని అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రూ.4.22 లక్షల కోట్ల వార్షిక ఉత్పత్తి లక్ష్యమని చెప్పారు. దక్షిణాసియాలోనే తొలి ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో ఫిబ్రవరి 3న ప్రారంభిస్తున్నామని, రెండు మూడేళ్లలో 3000 క్యూబిట్ల సామర్థ్యం గల క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేస్తామని వెల్లడించారు.
ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ.50 వేల కోట్లు, అంతరిక్ష రంగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఉన్నాయని, త్వరలో డ్రోన్ ఎయిర్ ట్యాక్సీలు తెస్తామని అన్నారు. విశాఖలో డేటా సెంటర్లకు అనుమతులు ఇచ్చామని, 2019-24 మధ్య రూ.2.47 లక్షల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇప్పుడు 12 రెట్ల వేగంతో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు.

