Tanguturi : ప్రకాశం పంతులు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకుంటాం
ఆంధ్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ప్రతినపూనిన వైయస్ఆర్‌సీపీ

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులు ఆలోచనలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఎటువంటి పోరాటానికైనా సిద్దమని వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రతినపూనారు. ముందుగా ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.... ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ప్రకాశం పంతులు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలకు బీజం పడిందని అన్నారు. ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం ఆనాటి నేతలు ముందుచూపుతో ఆలోచనలు చేస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, వారు కష్టంతో సాధించిన ప్రగతిని కూడా మసకబారుస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా తన ఐదేళ్ల పాలనలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆలోచనా విధానాలతో మహిళాభ్యుదయం, సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేశారని మల్లాది విష్ణు అన్నారు. స్వయం పరిపాలన నినాదంతో మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామని బ్రిటీష్ వారికి గుండె చూపించిన సింహం టంగుటూరు ప్రకాశం పంతులు అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రభుత్వ ఆస్తులను తన వారికి పప్పు బెల్లాల్లా కట్టబెడుతున్న చంద్రబాబు నిరంకుశ పాలనపై ప్రతి వైయస్సార్సీపీ కార్యకర్త ఒక టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తితో తిరగబడాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.
