Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసు: రిమాండ్ పొడిగింపు, మిథున్ రెడ్డి యూఎస్ ప్రయాణం కోసం పిటిషన్
మిథున్ రెడ్డి యూఎస్ ప్రయాణం కోసం పిటిషన్

Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ కేసులో నిందితులైన పలువురికి అక్టోబర్ 16వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది.
మిథున్ రెడ్డి న్యూయార్క్ ప్రయాణం కోసం అనుమతి కోరిన పిటిషన్
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అక్టోబర్ 20 నుంచి న్యూయార్క్ ప్రయాణం కోసం కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన ఏసీబీ కోర్టు, సిట్ అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది.
చెవిరెడ్డి ఆరోగ్య సమస్యలపై విన్నపం
మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు వివరించారు. వైద్యుల సలహాతో ఫిజియోథెరపీ చేయించాలని, ప్రభుత్వ గుర్తింపు పొందిన మంతెన ఆశ్రమంలో చికిత్స కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, పోలీస్ కస్టడీలోనే చికిత్స పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. నొప్పి తీవ్రంగా ఉందని, భరించలేని స్థితిలో ఉన్నానని కోర్టుకు విన్నవించారు. ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.
